Actor Kasturi Arrest in Hyderabad : తెలుగు ప్రజలపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటి కస్తూరిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న ఆమె తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలు తెలుగు సంఘాలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.
నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు : చెన్నై ఎగ్మోర్‌లో ఉన్న తెలుగు సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ కేసులో సమన్లు ఇవ్వడానికి పోలీసులు ఇటీవల పోయెస్ గార్డెన్‌లోని కస్తూరి ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమె సెల్ నంబరుకు ఫోన్ చేశారు. స్విచాఫ్ అని రావడంతో పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. గాలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈరోజు(శనివారం) సాయంత్రం హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో ఉన్నట్టు తెలుసుకున్న చెన్నై పోలీసులు ఇక్కడికి వచ్చి అరెస్టు చేశారు.
క్షమాపణ కోరిన కస్తూరి : తెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి ఇటివలే క్షమాపణ కోరారు. ఆమె విడుదల చేసిన ప్రకటనలో, తన తెలుగు స్నేహితుడు ఒకరు తాను చేసిన వ్యాఖ్యలను సావధానంగా వివరించారన్నారు. తాను భారతదేశ భిన్నత్వంలో ఏకత్వంపై అపార గౌరవం కలిగిన జాతీయవాదినని పేర్కొన్నారు. ఎప్పటికీ జాతి, ప్రాంతాలకు అతీతంగా ఉంటానన్నారు. తెలుగు భాషతో ప్రత్యేక బంధం ఉండటం అదృష్టమన్నారు. నాయకర్ రాజులు, కట్టబొమ్మన్, త్యాగరాజకృతి వైభవాన్ని ఆస్వాదిస్తూ పెరిగానని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు తనకు పేరు, ప్రతిష్ట, కుటుంబాన్ని ఇచ్చారని కస్తూరి తెలిపారు.
వివాదాస్పదమైన కస్తూరి వ్యాఖ్యలివే : తాను మాట్లాడింది ప్రత్యేకించి కొందరి గురించేనని, తెలుగు ప్రజలందరినీ కాదని మళ్లీ ఒకసారి చెబుతున్నానన్నారు. తెలుగు కుటుంబాలను గాయపరచటం తన ఉద్దేశం కాదని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానన్నారు. ప్రసంగంలో తాను లేవనెత్తిన కొన్ని ముఖ్యమైన విషయాల నుంచి దృష్టి మరల్చేందుకే ఈ చర్చ ప్రారంభమైందని తెలిపారు. తమిళనాడులో ఉండే తెలుగు ప్రజలు ఇక్కడి బ్రాహ్మణుల జరిగే పోరాటంలో పాల్పపంచుకోవాలని కోరుతున్నానన్నారు. బ్రాహ్మణుల భద్రతను డిమాండ్ చేస్తూ చెన్నైలో జరిగిన ఆందోళనలో కస్తూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వాటిని పలువురు ఖండించారు. దీనిపై పలువురు ఫిర్యాదులు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు.