కొండేపి ఎస్సై పై సీఈవోకు ఫిర్యాదు చేసిన కూలీలు- విచారించాలని డీజీపీకి ఆదేశాలు - Tobacco workers complained to CEO - TOBACCO WORKERS COMPLAINED TO CEO
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 17, 2024, 10:19 PM IST
Tobacco Workers Complained to State Election Officer in Prakasam District : ప్రకాశం జిల్లా కొండేపి ఎస్సై పై రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనాకు పలువురు కూలీలు ఫిర్యాదు చేశారు. కొండేపిలో పొగాకు రైతులు పని చేయించుకుని కూలీ ఇవ్వమంటే వేధిస్తున్నారని తెలిపారు. దీంతో న్యాయం చేయామని కొండేపి పోలీస్ స్టేషన్‌కు వెళితే ఎస్సై ఫిర్యాదు తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పొగాకు కూలీలు మాట్లాడుతూ, గత మూడు నెలలుగా కొండేపిలో పొగాకు రైతులు తమతో గొడ్డు చాకిరి చేయించుకున్నారని తెలిపారు. చివరికి పని పూర్తయిన తరువాత కూలీ ఇవ్వకుండా ఎగ్గొట్టాడమే కాకుండా వేధిస్తున్నారని వాపోయారు. దళిత కూలీలను కులంపేరుతో దూషించి దౌర్జన్యానికి పాల్పడ్డారని వెల్లడించారు.
ఆరు నెలల గర్భవతి పనిచేస్తూ కళ్లుతిరిగి పడిపోయినా ఆస్పత్రికి తీసుకువెళ్లనీయకుండా బెదిరించి వెట్టి చాకిరీ చేయించుకున్నారని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పని మెుత్తం అయిపోయిన తర్వాత కూడా కూలీల కోసం దాదాపుగా 20 రోజులుగా ఎదురు చూశామని వివరించారు. అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. కనీసం తాగేందుకు నీరు లేక నానాఅవస్థలు పడ్డామని కూలీలు కన్నీరుమున్నీరయ్యారు. తమ కూలీలు తమకు ఇప్పించి న్యాయం చేయమని కొండేపి పోలీస్ స్టేషన్‌కు వెళితే ఫిర్యాదు తీసుకోలేదని వాపోయారు. పొగాకు రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసీటి కేసు పెట్టి, ఎస్సై పై తగిన చర్యలు తీసుకోవాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.