సీఎం సొంత జిల్లాలో ఉపాధ్యాయుల స్థలాలపై అక్రమార్కుల కన్ను - Land irregularities in Kadapa
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 10:54 PM IST
Teachers Land Issue Kadapa: ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఉపాధ్యాయుల భూములకు రక్షణ కరవైంది. కడప శివారులోని ప్రభుత్వ ఉపాధ్యాయుల స్థలాలపై అక్రమార్కుల కన్నుపడింది. 1989లో ప్రభుత్వం దాదాపుగా 1400 మంది ఉపాధ్యాయులకు స్థలాలను కేటాయించింది. వారి పేర్లపై రిజిస్ట్రేషన్ కూడా చేయించింది. అయితే ఆ స్థలాల వద్ద సరైన మౌలిక వసతులు లేకపోవడంతో ఉపాధ్యాయులు నివాసాలు ఏర్పాటు చేసుకోలేదు. చివరకు ఏడాదిగా ఉపాధ్యాయులందరూ చందాలు వేసుకుని మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో పబ్బాపురం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ స్థలం తమదంటూ ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బుధవారం సుమారు 15 మంది అక్కడికి చేరుకుని హద్దుగా ఏర్పాటు చేసిన రాళ్లను పగలగొట్టి టీచర్లపై దౌర్జన్యానికి దిగారు. సమాచారం పోలీసులకు చేరవేయడంతో, విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సముదాయించారు. అనంతరం ఇరువర్గాలను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. స్థలం తమదని పబ్బాపురంలోని కొందరు వ్యక్తులు తమపై దౌర్జ్యానికి దిగుతున్నారని, ఆధారాలేవి వారి దగ్గర లేకపోయినా ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు.