విద్యార్థులు తక్కువ, పెట్టే ఖర్చు ఎక్కువ - విద్యాశాఖలో అంతా అవినీతే: విజయ్‌కుమార్ - Vijay Kumar On ap education system
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 4, 2024, 1:51 PM IST
TDP Vijay Kumar about Corruption in AP Education System: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో అవినీతి చిత్ర విచిత్రాలుగా ఉందని తెలుగుదేశం నేత నీలాయపాలెం విజయ్ కుమార్ మండిపడ్డారు. విద్యార్థులు తక్కువైతే ఎక్కడైనా ఖర్చు తగ్గుతుందని కానీ ఏపీలో విద్యార్థులు తక్కువ, పెట్టే ఖర్చు ఎక్కువ అని విమర్శించారు. 2022-23లో 45.13 లక్షల విద్యార్ధులకు విద్యా కానుక కింద 886 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. 2023-24కి దాదాపు 5.5 లక్షల విద్యార్ధులు తగ్గిపోయి 39.80 లక్షలకు తగ్గితే విద్యా కానుక ఖర్చు మాత్రం 270 కోట్లు పెరిగి 1042 కోట్లకు ఎలా చేరిందని ప్రశ్నించారు.
అంతకు ముందు 2021-22లో 45.38 లక్షల మంది విద్యార్ధులతో విద్యా కానుక ఖర్చు 789 కోట్లు మాత్రమే అని చెప్పారు. గత మూడేళ్లలో 5 లక్షలమంది విద్యార్థులు ప్రైవేటు బడులకు వెళ్లారని తెలిపారు. విద్యార్ధులు తగ్గే కొద్దే ఖర్చు తగ్గాల్సింది పోయి ఎలా పెరుగుతుందని నిలదీశారు. టెండర్లు పిలవకుండా 19 మంది పాత కాంట్రాక్టర్లకే కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు తమకు నచ్చినోళ్లకే అన్నీ కట్టబెట్టేశారని విమర్శించారు. టెండర్ 100 కోట్లు దాటితే కమీషన్‌కు ఇవ్వాలనే నిబంధనను పాటించకుండా, రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించి కాంట్రాక్టులు వంద కోట్లు దాటకుండా చూశారని ఆరోపించారు.