జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చారు: అశోక్‌బాబు - సీఎం జగన్‌పై అశోక్‌బాబు ఫైర్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 25, 2024, 7:06 PM IST
TDP MLC Ashokbabu Fires on CM Jagan: తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసగించడంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు అనటానికి ఆరోగ్యశ్రీ పథకమే నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఈ గొప్ప పథకాన్ని అనాలోచిత నిర్ణయాలతో జగన్ నీరుగార్చాడని ఆయన మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పరిధి, చికిత్స వ్యయం పెంచానని చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో పేదలకు ఒరిగింది శూన్యమని ఆయన పేర్కొన్నారు. వైద్య రంగంలో జగన్ సాధించిన ఘనత ఏమిటంటే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు రూ.1200 కోట్లు బకాయిలు పెట్టడమని ఆయన విమర్శించారు.
Jagan Not Paid for Arrears to Aarogyasri Hospitals: వైద్యసేవల బిల్లు 1000 రూపాయలు దాటితే ఖర్చు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని, వైద్య చికిత్సల వయో పరిమితిని రూ.25లక్షలకు పెంచామన్న జగన్ మాటలన్నీ బూటకాలుగా తేలిపోయాయని అశోక్ బాబు పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ పథకం అన్నారు కానీ ఎన్ని కుటుంబాలకు ఎంత మంది వైద్యులున్నారంటే మాత్రం సీఎం చెప్పడం లేదని ఆయన ఆక్షేపించారు. ప్రభుత్వం నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో సకాలంలో పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.