APPSC job Calendar 2025 : నిరుద్యోగుల నిరీక్షణకు తెరదించేలా కూటమి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్లు సిద్ధం చేస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 866 ఉద్యోగాల భర్తీకి 18 నోటిఫికేషన్లు వెలువరించే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకూ పరీక్ష తేదీలు ప్రకటించనుంది. ఈ నెల 12న జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు సమాయాత్తం అవుతోంది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ త్వరలో పూర్తి కానుందని, దాని ప్రకారమే ఉద్యోగాల భర్తీ ఉంటుందని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.
గత ఐదేళ్లూ జగన్ మోసాలకు బలైన నిరుద్యోగుల కొలువుల కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచే కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను APPSCకి పంపారు. ఇప్పటి వరకూ 866 పోస్టులకు ఆర్థికశాఖ కూడా ఆమోదం తెలిపింది. వాటికి 18 నోటిఫికేషన్లు సిద్ధం చేస్తోంది. ఈ నెల 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ యువజన దినోత్సవాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని యోచిస్తోంది. ఒక్క అటవీ శాఖ విభాగంలోనే 814 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ల పోస్టులు -100, ఫారెస్టు బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ -691 పోస్టులు ఉన్నాయి.
ఇకపై అన్ని పోటీ పరీక్షలు ఆ విధానంలోనే - APPSC ప్రత్యేక కమిటీ నివేదిక
3 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ : ఇక వేల మంది నిరీక్షిస్తున్న గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రసుత్తం 100కు పైగా గ్రూప్-1, 200లకు పైగా గ్రూప్-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రహదారులు- భవనాలు, నీటిపారుదల, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, గిరిజనాభివృద్ధి విభాగాల్లో 300లకుపైగా AE పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు APPSCకి నివేదించారు. ఆర్థిక శాఖ అనుమతిరాగానే వీటన్నింటినీ జాబ్ క్యాలెండర్‌తో కలిపి ఉద్యోగ నియామక ప్రకటనలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. APPSCద్వారానే ఈ ఏడాదిలో 3 వేలకు పైగా కీలక ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇకపై ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అదే ఏడాది ముగిసేలోగా నియామకాలు పూర్తి చేయాలని భావిస్తోంది.
ఇప్పటికే ఇచ్చిన 20 నోటిఫికేషన్ల నియామకాల్లో జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేసేందుకూ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఫిబ్రవరి 23న గ్రూప్-2 మెయిన్స్, ఏప్రిల్ తర్వాత గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. డిప్యూటీ ఈవో, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, NTR వర్సిటీలో జూనియర్ అసిస్టెంట్లు, ASOలు, పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్లు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, టీటీడీలో లెక్చరర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు ఇవ్వగా ఈ ఏడాది జూన్‌లోగా సంబంధిత పరీక్షలన్నీ పూర్తి చేయాలని నిర్ణయించింది.
ఉద్యోగం మీ లక్ష్యమా? - టాప్ టెన్ రంగాల్లో లక్షలాది అవకాశాలు
రైల్వే భారీ నోటిఫికేషన్ - న్యూ ఇయర్‌లో 32,438 గ్రూప్-డి పోస్టులు భర్తీ!