'టీటీడీ మాజీ ఈవో, ఛైర్మన్ల అవినీతిపై విచారణ జరపాలి' - TDP Leaders Complaint on corruption - TDP LEADERS COMPLAINT ON CORRUPTION
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 8, 2024, 7:28 PM IST
TDP Leaders Complaint on TTD EX EO and Ex Chairman : తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్ కుమార్ సీఎస్ నీరభ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీకి లబ్ది చేకూర్చేందుకు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలకు తెగబడ్డారని, సంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకున్నారని, వారిపై సీబీ సీఐడీ లేదా విజిలెన్స్ శాఖతో విచారణ జరిపి అక్రమాలను వెలికి తీయాలని కోరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే సంప్రదాయానికి విరుద్ధంగా ఐఏఎస్ అధికారికి కాకుండా ధర్మారెడ్డిని జేఈవోగా, ఆ తరువాత ఈవోగా జగన్ రెడ్డి ప్రభుత్వం నియమించిందని నేతలు ఆరోపించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో తనకున్న పరిచయాలను దుర్వినియోగం చేస్తూ ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ విరాళాల సేకరణకు మార్గంగా ధర్మారెడ్డి వ్యవహరించారని విమర్శించారు. తిరుమలలో అతిథి గృహాలకు కేటాయించే భూముల్లో కూడా ధర్మారెడ్డి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్‌ను పాటించలేదని మండిపడ్డారు. ధర్మారెడ్డి మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తే క్రిమినల్ కేసుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకు దిల్లీలో ఆయన రాజకీయ ప్రమేయం, కుతంత్రాలు స్పష్టంగా తేటతెల్లమవుతాయని లేఖలో పేర్కొన్నారు.