వాలంటీర్లు వైసీపీ పోలింగ్ ఏజెంట్లు- మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు - TDP LEADERS COMPLAIN TO CEO - TDP LEADERS COMPLAIN TO CEO
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 13, 2024, 10:38 PM IST
TDP Leaders Complain to CEO : వాలంటీర్లంతా రాజీనామా చేసి పోలింగ్ ఏజెంట్లుగా బాధ్యతలు తీసుకోవాలంటూ మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వాఖ్యలు చేసిన మంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు సీఈఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ, అధికార పార్టీకి అనుకూలంగా విద్యార్ధులతో సర్వే చేయించిన ఆంధ్రా యూనివర్సిటీ వీసీని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంతగా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా చర్యలు ఈసీ ఎందుకు తీసుకోవటం లేదిని ప్రశ్నించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నివాసం ఉండటం లేదని టీడీపీ అభ్యర్ధి బోండా ఉమామహేశ్వరరావు ఓటు తొలగిస్తామని చెప్పటం హాస్యాస్పదమని ఎద్ధేవ చేశారు.
ముఖ్యమంత్రి జగన్ కుటుంబంతో కలిసి తాడేపల్లిలో నివాసం ఉంటున్నారని అయితే ఆయన ఓటు పులివెందులలో ఎందుకుందని ప్రశ్నించారు. పులివెందులలో ఆయన ఓటు తీసేసి మంగళగిరిలో చేర్చితే ఆయన కూడా లోకేశ్‌కు ఓటు వేస్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట మాత్రమే ఓటు ఉండాలన్నది నిబంధన అని తెలిపారు. అంతేగాని రాత్రి పూట ఉండటం లేదంటూ ఓటు తీసేయడం విడ్డూరంగా ఉందని వర్ల రామయ్య తెలిపారు. మరోవైపు వైసీపీ అభ్యర్ధులు కొందరు దేవాలయాలు, చర్చిల్లో ఎన్నికల ప్రచారానికి పాల్పడుతున్న ఘటనల్ని ఆధారాలతో సహా సీఈఓకి ఇచ్చినట్టు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఆంధ్రా యూనివర్సిటీ వీసీ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏం చర్యలు తీసుకున్నారో ఇప్పటిదాకా ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నించారు.