ఫైళ్లు దగ్ధం చేస్తే వైఎస్సార్సీపీ చేసిన పాపాలు పోవు - అన్ని సాక్ష్యాలున్నాయి: జవహర్ - Jawahar on Files Burnt Incident - JAWAHAR ON FILES BURNT INCIDENT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 4, 2024, 2:18 PM IST
Jawahar on Govt Files Burnt Incident : విజయవాడ నగర శివారులోని కృష్ణానది కరకట్టపై బస్తాల కొద్దీ కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన దస్త్రాలను తగులబెట్టిన ఉదంతంపై మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్ స్పందించారు. కవితకు కాదేది అనర్హం అన్నట్లు, దోపిడీకి కూడా కాదేది అనర్హం అన్నట్లు వైఎస్సార్సీపీ నాయకులు దోచుకున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలు శాండ్, ల్యాండ్, వైన్స్ దేన్నీ వదల్లేదని జవహర్ ఆరోపించారు. ఇప్పుడు దోచుకున్నది దొరకుండా ఉండటానికి ఫైళ్లు దగ్ధం చేస్తున్నారని విమర్శించారు. కాగితాలు కాల్చినంత మాత్రాన ఆ పార్టీ చేసిన పాపాలు ఎక్కడికి పోవని చెప్పారు. అన్ని సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు. మరోవైపు దోపిడీదారులకు సహకరిస్తున్న అధికారులు అప్రూవర్‌గా మారాలని సూచించారు. వాసుదేవరెడ్డి, సమీర్ శర్మలు నిజాలను బయట పెట్టి, సమాజంలో తమకున్న గౌరవాన్ని నిలబెట్టుకోవాలన్నారు. వైఎస్ జగన్, తన అనుచరులు తప్పించుకోలేరని పేర్కొన్నారు. వారు స్వాహా చేసిన మొత్తాన్ని కక్కిస్తామని జవహర్ వ్యాఖ్యానించారు.