జమ్మలమడుగు టీడీపీ ఇంఛార్జ్ భూపేష్ కంటతడి - బీజేపీకి సీటు కేటాయిస్తారని ఆందోళన - TDP spiritual meeting in kadapa
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 12, 2024, 7:38 PM IST
TDP Leader Devagudi Bhupesh Reddy Spiritual Meeting : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని సర్వేలు, ప్రజలు స్పష్టంగా చెబుతున్నారని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఇంచార్జ్ దేవగుడి భూపేష్ రెడ్డి అన్నారు. పొత్తులో భాగంగా ఇక్కడి సీటు బీజేపీకి కేటాయిస్తారేమోననే ఆందోళనతో కంటతడి పెట్టుకున్నారు. 30 నెలల పాటు నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపించిన యువనేత భూపేష్ రెడ్డికి ఇపుడు ఆయన బాబాయ్ మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుండటంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇంకా అధిష్ఠానం నిర్ణయం తీసుకోనప్పటికీ తమ అభిప్రాయాలను చంద్రబాబు నాయుడుకు తెలియజేయాలనే ఉద్దేశంతో జమ్మలమడుగులో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. భూపేష్ రెడ్డి తండ్రి మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఆధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి దేవగుడి సోదరులు ఆరుగురు హాజరయ్యారు. తాను పార్టీకి చేసిన సేవలను నారా లోకేశ్, చంద్రబాబు నాయుడు గుర్తించారని తనకే టికెట్ వస్తుందని భూపేష్ గద్గద స్వరంతో ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో నారాయణరెడ్డి వదులుకున్నట్లు తాను ఈసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదని జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగరేస్తానని స్పష్టం చేశారు. పరిణామాలు ఎలా ఉన్నా భవిష్యత్తులో కార్యకర్తలు, అభిమానులంతా తమ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు.