ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: టీజీ భరత్ - టీడీపీ ఇంచార్జి భరత్ సైకిల్ యాత్ర
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 8:58 PM IST
TDP Leader Bharath Cycle Trip Undertaken in Kurnool: వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని కర్నూలు టీడీపీ ఇంచార్జి టీజీ భరత్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ గుర్తుకు ఓటేయాలని భరత్ కర్నూలులో సైకిల్ యాత్ర చేపట్టారు. వైసీపీ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా చంద్రబాబునాయుడును ఎప్పుడు ముఖ్యమంత్రిగా చేసుకోవాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నట్లు భరత్ తెలిపారు. వైసీపీ హయాంలో పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్యులు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా యువత, జీతాలు పెరగక ఉద్యోగులు ఇలా అన్ని విధాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుతం ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని భరత్ అన్నారు. సైకిల్ యాత్ర కార్యక్రమంలో కర్నూలు జనసేన ఇంచార్జి అర్షద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్షద్ మాట్లాడుతూ వైసీపీ నుంచి పోటీ చేయడానికి కర్నూలులో అభ్యర్థి దొరకక ఇతర నియోజకవర్గాల నుంచి తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నగరంలో ఉన్న సమస్యలను ఈ సైకిల్ యాత్రలో తెలుసుకున్నట్లు భరత్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భరత్ స్పష్టం చేశారు.