వైసీపీ పరిస్థితి మునిగిపోయే నావ- టీడీపీలో చేరేందుకు నేతలు సిద్ధం: కేశినేని చిన్ని - keshineni chinni spirited meeting
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 3:37 PM IST
TDP Janasena Party Leaders Meeting Under the Leadership of Keshineni Chinni : టీడీపీ గేట్లు తెరిస్తే కృష్ణానదికి వరద వచ్చినట్లు వైసీపీ నేతలు వరస కడతారని తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని తెలిపారు. వైసీపీ పరిస్థితి మునిగిపోయే నావలా తయారైందని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో అన్ని సీట్లు టీడీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు అధిష్ఠానంతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. వైసీపీ తరపున విజయవాడ ఎంపీ సీటుకు పోటీ చేయడానికి అభ్యర్థులు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధిక మెజారిటీతో అధికార పగ్గాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
జగ్గయ్యపేట వత్సవాయిలో జరిగిన టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, జనసేన ఇన్ఛార్జ్ మురళీకృష్ణతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర తెలుగు యువత నేత కిలారు చిన్ని ఆధ్వర్యంలో వత్సవాయి నుంచి దుబ్బాకుపల్లి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.