ఏప్రిల్ నుంచే 4 వేల రూపాయల పింఛన్ - అదీ ఇంటి వద్దే : అచ్చెన్నాయుడు - TDP Atchannaidu on Pensions - TDP ATCHANNAIDU ON PENSIONS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 8, 2024, 8:48 PM IST
TDP Atchannaidu on Pensions: ఇళ్ల వద్దే పెన్షన్లు ఇవ్వాలని ఈసీ చెప్పినా వృద్ధులు, వికలాంగులను సచివాలయాలకు తిప్పారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ది కోసం జగన్ రెడ్డే శవ రాజకీయాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రాబోయే చంద్రబాబు ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి 4 వేల రూపాయల పింఛన్ ఇంటి వద్దే ఇస్తుందని హామీ ఇచ్చారు. దర్శిలో పింఛన్‌దారులతో జగన్ రెడ్డి డ్రామా నభూతో నభవిష్యతి అని ఎద్దేవా చేశారు.
మూడు వేల రూపాయల పెన్షన్‌పై అధికారంలోకి వచ్చాక మాట మార్చి లబ్దిదారులకు 32 వేలు ఎగ్గొట్టారని విమర్శించారు. గతంలో ఫించను మొత్తాన్ని 200 నుంచి 2 వేలకి పెంచిన ఘనత చంద్రబాబుదే అని, జగన్ రెడ్డి పెంచింది కేవలం వెయ్యి మాత్రమే అని తెలిపారు. ఖజానాలో నిధులు లేకపోవడం వల్లనే ఈ నెల ఒకటో తేదీన పింఛన్లు ఇవ్వలేదని విమర్శించారు. 3వ తేదీన అప్పు తెచ్చి 4వ తేదీన పింఛన్లు ప్రారంభించారని ధ్వజమెత్తారు. ఏప్రిల్, మే, జూన్ పింఛనుతో కలిపి జులైలో 7 వేల రూపాయలు ఇంటి వద్దనే ఇస్తామని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి శవ రాజకీయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.