గురుకుల పాఠశాలలో విద్యార్థినులే వంట మేస్త్రీలు- బాలికల ఆవేదన - Students cooking at School - STUDENTS COOKING AT SCHOOL
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 25, 2024, 6:50 PM IST
Students Cooking at Nuziveedu Girls Gurukula School : చదువుకోవాల్సిన విద్యార్థినులు గురుకుల పాఠశాలలో వంట మేస్త్రీలుగా మారిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లా నూజివీడులోని బాలికల గురుకుల పాఠశాలలో కొందరు విద్యార్థినులు తెల్లవారుజామున అల్పాహారం తయారు చేస్తూ కనిపించారు. ఇదేంటని వారిని ప్రశ్నిస్తే కూరగాయలు కోయటం, అల్పాహారం తయారు చేయడం, వంటలో సాయం చేయడం ప్రతి రోజూ పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులంలో హైస్కూల్ స్థాయిలో 521 మంది, ఇంటర్ స్థాయిలో 156 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు.
వసతులు కల్పించి, బాలికల విద్యను ప్రోత్సహించాలి : గురకులాల నిర్వహణ సరిగా లేకపోవడంతో చదువుకోవాల్సిన విద్యార్థులు ఇలా పనులు చేయాల్సిన దుస్థితి వచ్చిందని పలువురు విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకులాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆరోపిస్తున్నారు. మరుగుదొడ్లలో కొన్నింటికి తలుపులు లేవని విద్యార్థినులు తెలిపారు. ఆహార పదార్థాలు, కూరగాయలు నాసిరకంగా ఉంటున్నాయని వారు ఆరోపించారు. ప్రభుత్వం నూజివీడు బాలికల గురుకుల పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించి, బాలికల విద్యను ప్రోత్సహించాలని కోరుతున్నారు.