హిందూ ధార్మిక సంస్థల ఉద్యమం - జనవరి 5న 'హైందవ ధర్మ శంఖారావం' - HINDU DHARMIKA ORGANIZATIONS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2024, 7:40 PM IST
Hindu Dharmika Organizations Meeting : దేశంలోని హిందూ దేవాలయాలను 'హిందూ-ధార్మిక' సంస్థలే నిర్వహించేలా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామని శైవ క్షేత్ర పీఠాధిపతి శివ స్వామి చెప్పారు. ఇతర మతాలలోని దేవాలయాలను ఆ మత పెద్దలే నిర్వహించుకుంటున్నారని వెల్లడించారు. ప్రస్తుతం హిందూ దేవాలయాలను మాత్రం ప్రభుత్వం ఆధీనంలో ఉన్న దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ విధానానికి స్వస్తి పలికి హిందూ-ధార్మిక సంస్థలే నిర్వహించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలోని దైవ క్షేత్రంలో వివిధ పీఠాధిపతులతో శివ స్వామి సమావేశం అయ్యారు.
హిందూ దేవాలయాలను 'హిందూ-ధార్మిక' సంస్థలే నిర్వహించేలా వచ్చే సంవత్సరం జనవరి 5న 'హైందవ ధర్మ శంఖారావం' పేరుతో అన్ని పీఠాధిపతులతో శైవ క్షేత్రంలో సభ ఏర్పాటు చేస్తున్నామని శివ స్వామి చెప్పారు. విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక, సాధు పరివార్, హిందూ సంఘాల ఐక్య కార్య చరణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే హైందవ ధర్మ శంఖారావంలోనూ ఇదే అంశంపై విస్తృతంగా చర్చిస్తామని తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహిస్తున్న ఆలయాలను హిందూ-ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచేలా డిమాండ్ చేస్తున్నామని శివ స్వామి స్పష్టం చేశారు.