మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు- షెడ్యూల్‌ను పొడిగించిన విద్యాశాఖ - Work adjustment of Surplus Teachers
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 13, 2024, 12:47 PM IST
Work Adjustment of Surplus Teachers: మిగులు ఉపాధ్యాయుల పని సర్దుబాటుపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ను పొడిగించింది. మిగులు ఉపాధ్యాయుల జాబితాలో తప్పులను సవరించేందుకు అవకాశం కల్పించింది. సీనియారిటీ జాబితా ముసాయిదాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రధానోపాధ్యాయుడు, డీడీవోలకు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు జిల్లా విద్యాధికారులు, ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ సమాచారం పంపింది. ఆన్లైన్లో తప్పులు ఉంటే సరి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ కసరత్తు పూర్తి చేసేందుకు ఈనెల 15వరకు అవకాశం కల్పించింది.
ఆగస్టు 16న మిగులు ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ప్రచురించి, 17న మండలస్థాయిలో సర్దుబాటు చేయనున్నట్లు పేర్కొంది. కొంతమంది ఉపాధ్యాయులు జిల్లాపరిషత్తు నుంచి పురపాలక బడులకు మారారు. వీరు ఉద్యోగం చేరిన తేదీని సీనియారిటీగా నమోదు చేస్తుండగా మరికొందరు పురపాలక యాజమాన్యానికి వచ్చిన తేదీని సీనియారిటీగా నమోదు చేశారు. స్టడీ లీవ్‌లో ఉన్నవారు సైతం పని చేస్తున్నట్లు చూపి అక్కడ మిగులు ఉపాధ్యాయులను చూపారు.