వినియోగదారులకు మరోజలక్, ఇసుక ధరలు పెంపు - పట్టించుకోని ప్రభుత్వం - రాష్ట్రంలో ఇసుక ధరలతో దోపిడీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 21, 2024, 9:31 AM IST
Sand Price Increase : అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వేపరాళ్ల సమీపంలోని వేదవతి నది రీచ్‌లో నిర్వాహకులు ఇసుక ధరలు అమాంతంగా పెంచడంతో టిప్పర్లు, ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. విజయవాడకు చెందిన ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ వారు వేదవతి హాగరిలో రీచ్ నిర్వహిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక ఇదివరకు 2500 రూపాయలు అమ్ముతుండాగా ప్రస్తుతం 3000 రూపయలకు ధర పెంచారు. సిక్స్ వీలర్ టిప్పర్కు వెయ్యి రూపాయలు, 10 వీలర్ పెద్ద టిప్పర్కు ఇది వరకు రూ. 8,550 లు ధర ఉండగా, ప్రస్తుతం సుమారు రూ. 10 వేలకు విక్రయిస్తున్నారు. దీంతో టిప్పర్లు, ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు.
పాత ధరలకే ఇసుక లోడింగ్ చేయాలంటు టిప్పర్లు, ట్రాక్టర్ల డ్రైవర్లు పట్టు పట్టారు. దీంతో ఇసుక రీచ్‌ల నిర్వాహకులు ఇసుక లోడింగ్ ఆపివేశారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమీపిస్తుండగా జగన్ సర్కార్ ఇసుక దోపిడీకి మరో ఎత్తుగడ వేస్తూ విచ్చలవిడిగా రీచులలో ఇసుక ధరలు పెంచి దోపిడీకి పాల్పడుతుంది. పెంచిన ధరలకు బిల్లులు వేయకుండా, రీచులలోని నిర్వాహకులు పాత ధరలకే బిల్లులు వేస్తూ అధిక ధరలు ఎలా వసూలు చేస్తున్నారని వాహనాల డ్రైవర్లు, నిర్వాహకులకు మద్య ఘర్షణ చోటు చేసుకోంది.
ప్రతిమ కంపెనీ యజమానులు ఆదేశాల మేరకు ఇసుక ధరలు పెంచాల్సి వచ్చిందని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇసుక రీచ్‌లలో గుత్తేదారులు ఇష్టం వచ్చిన విధంగా ధరలు పెంచుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దోపిడీకి నిదర్శనంగా నిలుస్తోంది.