మూసీ సర్వే రసాభాస- చైతన్యపురిలో అధికారులను అడ్డుకున్న స్థానికులు - Musi Catchment Survey
Published : Sep 26, 2024, 5:00 PM IST
Clashes in Musi Catchment Survey : హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి, వెంకటసాయినగర్ కాలనీ మూసీ సర్వేలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మూసీనది పరివాహక ప్రాంతం గుర్తింపు సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులను స్ధానికులు అడ్డుకుని నిలదీశారు. ఆక్రమణలను గుర్తించి ఇళ్లకు మార్కింగ్ వేసేందుకు వచ్చిన ఎంఆర్‌డీసీ అధికారులు, తహసీల్దార్ బృందాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దుర్భాషలాడుతూ, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అధికారులను ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పేదల పాలిట శాపంగా మారిందని వారు మండిపడ్డారు. చెరువుల కబ్జాలను కూల్చివేయకుండా, మూసీ వెంబడి పేదల ఇళ్లను కూల్చేందుకు ఎందుకు వస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. పేదల జీవితంతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి కుటుంబానికి తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. ఎన్నో ఏళ్లుగా తాము ఇక్కడే ఉంటున్నామని, ఉన్నఫలంగా ఇళ్లను కూలిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం మూసీ నిర్ణయంపై వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు.