గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మా పొట్ట కొట్టింది : లీలా మాధవరావు - Ration Dealers Fires on jagan - RATION DEALERS FIRES ON JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 7:07 PM IST
Ration Dealers Fires on Jagan : గత ప్రభుత్వ హయాంలో రేషన్ డీలర్ల పొట్టను జగన్మోహన్ రెడ్డి కొట్టారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు లీలా మాధవరావు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తామందరం కలిసి కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికామని పేర్కొన్నారు. మరోవైపు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ తమను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. అనకాపల్లిలో జిల్లా కసింకోటలో ఏర్పాటు చేసిన రేషన్ డీలర్ల సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
జగన్మోహన్ రెడ్డి రేషన్ డీలర్లకు సమాంతరంగా వ్యవస్థను తీసుకొచ్చి ఆహార భద్రత చట్టానికి తూట్లు పొడిచారని లీలా మాధవరావు ఆరోపించారు. ఈ ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని కోరారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని రేషన్ డీలర్‌కు రూ. 7500, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.25 వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పింఛన్ నగదు పంపిణీ రేషన్ డీలర్ ద్వారా చేపట్టాలని కోరుతున్నట్లు లీలా మాధవరావు పేర్కొన్నారు.