శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి - 'కమ్యూనిటీ ఓట్లు దండుకునే కార్యక్రమమా? అని ప్రశ్నించిన నేతలు - గొర్రెల పెంపెకందారులశిక్షణాకేంద్రం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 22, 2024, 7:53 PM IST
Protocal Issue In Nandyala District : నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం హుస్సేనాపురంలో గొర్రెల పెంపెకం దారుల శిక్షణా కేంద్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. అయితే ప్రారంభోత్సవాల్లో మంత్రితో పాటు అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని రాష్ట్ర గొర్రెల పెంపెకం దారుల అధ్యక్షుడు నాగేశ్వర్ రావు ఆరోపించారు. మంత్రి పాల్గొన్న కార్యక్రమానికి జిల్లాలో ఉన్న గొర్రెల సొసైటీ డైరెక్టర్లు, రాష్ట్ర అధ్యక్షులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు.
అధికారులు కురుమ, యాదవులపై చిన్న చూపు చూడడంపై నాగేశ్వర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గత టీడీపీ హయాంలో ఉండే సబ్సిడీలు, రాయితీలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఏ మాత్రం పట్టించుకోవడం లేదని గుర్తు చేశారు. గొర్రెల పంపిణీకి సంబంధించిన నిధులను ఎవరు, ఎటు మళ్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు మూడు నెలల్లో ఉంటుందో పోతుందో ప్రభుత్వం ఇప్పుడు మా కమ్యూనిటీ ఓట్లు దండుకుందామని చూస్తున్నారా? అంటూ అధికార పార్టీ వైఖరిపై నాగేశ్వర్ రావు మండిపడ్డారు.