21వ రోజు మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్ - సమస్యల సత్వర పరిష్కారానికి భరోసా - Nara Lokesh Praja Darbar - NARA LOKESH PRAJA DARBAR
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 6, 2024, 4:24 PM IST
Nara Lokesh Praja Darbar Program : రాష్ట్రంలో ఏ ఒక్కరిని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే పలకరిస్తున్నాయని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో నారా లోకేశ్ 21వ రోజు ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రజాసమస్యలను నాయకులు పట్టించుకోలేదని లోకేశ్ మండిపడ్డారు. తమ భూములు కబ్జాకు గురయ్యాయని, ఏ ఆధారం లేని తమకు శాశ్వత నివాసం కల్పించాలని కోరుతూ పలువురు లోకేశ్‌కు విన్నవించారు. గత ప్రభుత్వంలో అర్హత ఉన్నా వృద్ధాప్య, వితంతు, వికలాంగ, పెన్షన్ తొలగించారని, అనారోగ్యంతో బాధపడుతున్న తమకు వైద్య సాయం అందించాలని, వివిధ వృత్తి, వ్యక్తిగతమైన సమస్యలను పరిష్కరించాలంటూ బాధితులు మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు. గత ప్రభుత్వ హయాంలో నష్టపోయిన తమను ఆదుకోవాలంటూ హోం గార్డులు, అప్కాస్ ఉద్యోగులు లోకేశ్‌ను కోరారు. సమస్యల సత్వర పరిష్కారానికి లోకేశ్ భరోసా ఇచ్చారని బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
శ్రీ కనక పుట్లమ్మ అమ్మవారని దర్శించుకున్న మంత్రి లోకేశ్ : గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరులో వెలిసిన శ్రీ కనక పుట్లమ్మ అమ్మవారని మంత్రి లోకేశ్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకముందు కూటమి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ సమాగ్రాభివృద్ధికి కృషి చేస్తామని లోకేశ్ తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావలని లోకేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు.