బస్తాల కొద్దీ దస్త్రాలు దహనం - కొన్ని ఫైళ్లపై మాజీ మంత్రి ఫొటోలు - GOVERNMENT DOCUMENTS BURNT - GOVERNMENT DOCUMENTS BURNT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 4, 2024, 7:09 AM IST
Pollution Control Board and AP Mineral Development Corporation Documents Burnt : కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలను విజయవాడ - అవనిగడ్డ కరకట్టపై బుధవారం రాత్రి తగలబెట్టిన వైనం కలకలం రేపింది. ఇందులో కొన్ని సీఎంఓకు చెందిన దస్త్రాలు, కాలుష్య నియంత్రణ మండలికి చెందిన హార్డ్ డిస్కులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ చిత్రాలు ఉండడం చూసిన ఓ టీడీపీ కార్యకర్త పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, అధికార నేతలకు సమాచారం అందించారు.
దుండగలు కారుతో యనమలకుదురు వైపు పరారవ్వడం గమనించిన టీడీపీ నేతలు ఆ వాహనాన్ని అడ్డుకుని, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వచ్చి కాలిపోయిన దస్త్రాలను పరిశీలించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో పత్రాలు దగ్దం చేసినట్లు డ్రైవర్ నాగరాజు పేర్కొన్నారు.
వైకాపా ప్రభుత్వం అవినీతిలో కురుకుపోయింది కాబట్టే సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. అందులో భాగంగానే కొన్ని C.M.Oకు చెందిన దస్త్రాలు, కాలుష్య నియంత్రణ మండలి హార్డ్ డిస్కులను తగలబెట్టారని మండిపడ్డారు. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ ఫొటోలు ఉన్నాయని చెప్పారు. దీనిపై అధికారులు విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలిపారు.