పోలీసుల మాక్ డ్రిల్ - ఏం జరుగుతుందో అర్థంకాక ఆశ్చర్యంగా వీక్షించిన ప్రజలు - Police Mock Drill in Dharmavaram - POLICE MOCK DRILL IN DHARMAVARAM
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 25, 2024, 10:03 PM IST
Police Mock Drill in Dharmavaram: సత్యసాయి జిల్లా ధర్మవరంలో డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ చేశారు. వాస్తవాన్ని తలపించేలా అల్లరి మూకలు రాళ్లు రువ్విన్నట్లు, పోలీసులు లాఠీఛార్జ్, కాల్పులు జరిపిన్నట్లు మాక్ డ్రిల్ చేపట్టారు. ఒక వ్యక్తి కింద పడిపోవడంతో పోలీసులు స్ట్రెచ్చర్‌పై మోస్తూ తీసుకెళ్లడం వంటి దృశ్యాలు ప్రజలకు ఇది నిజమా అబద్ధమా అని అర్థంకాక ఆసక్తిగా వీక్షించారు.
అల్లర్లకు పాల్పడుతున్న వారిని చెదరగొట్టడం, రబ్బరు బులెట్లను ప్రయోగించడంతో పాటు లాఠీఛార్జ్‌లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించడం వంటి అంశాలను కళ్లకు కట్టినట్లు ప్రజలకు చూపించారు. ఎవరైనా అల్లర్లు సృష్టించినా, హింసకు ప్రేరేపించినా చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13వ తేదీన ఎన్నికల రోజు, తర్వాతి రోజు నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, హింసాత్మక ఘటనలు చోటు చేసుకొన్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 4న ఓట్ల లెక్కింపు రోజున హింసాత్మక ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే పనుల్లో భాగంగా పోలీసు అధికారులు నేడు మాక్ డ్రిల్ నిర్వహించారు.