బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ కలకలం - నలుగురు యువకులు అరెస్ట్ - DRUGS IN BIRTHDAY PARTY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 10, 2024, 8:09 PM IST
Drugs at Birthday Party in East Godavari District : తూర్పుగోదావరి జిల్లాలో డ్రగ్స్ దొరకడం కలకలం రేపింది. రాజానగరం మండలం భూపాలపట్నంలోని ఓ గెస్ట్ హౌస్‌లో కొందరు యువకులు బర్త్ డే పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో నలుగురు యువకులు ఓ ఆన్ లైన్ యాప్ ద్వారా డ్రగ్స్ బుకింగ్ చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేపట్టగా ఓ కారులో నాలుగు గ్రాముల కొకైన్, మరో 50 గ్రాములు గంజాయి బయటపడింది. ఈ కేసులో దేవాబత్తుల దినేష్, వేమన విక్రం రాదా గగన్, బలం అజయ్, దువ్వనబోయిన పుష్పరాజ్‌లను అరెస్టు చేశారు. మరో నిందితుడు పవన్ కుమార్ పరారీలో ఉన్నాడు.
మత్తు పదార్థాలు కలిగి ఉన్న ఒక కారును సీజ్ చేశారు. అయితే వీరికి డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఈ యువకులే డ్రగ్స్ కొనుగోలు చేసి సేవిస్తున్నారా? లేదా ఎవరికైనా సప్లై చేస్తున్నారా? అసలు డ్రగ్స్ రాకెట్ వెనక ఎవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ వాడకం, సరఫరాను తీవ్రంగా పరిగణిస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లలు కొరియర్ ద్వారా ఎలాంటి ఆర్డర్లు పెడుతున్నారో నిఘా పెట్టాలని పోలీసులు హెచ్చరించారు.