బట్టబయలైన వైసీపీ కుట్ర- పేర్ని నాని ఆడియో లీక్ - YSRCP MLA Perni Nani Audio Leak - YSRCP MLA PERNI NANI AUDIO LEAK
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 3, 2024, 10:49 AM IST
YSRCP MLA Perni Nani Audio Leak: పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించినా వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదు. నేడు ఇవ్వనున్న పెన్షన్ల పంపిణీలో రాజీనామా చేసిన వాలంటీర్లనూ భాగస్వామ్యం చేయాలని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని గ్రామ సర్పంచ్‌లు, ఆ పార్టీ నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం చెప్పడంతో వారితో వైసీపీ నేతలు రాజీనామాలు చేయిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్ద, మిగిలిన వారికి సచివాలయం వద్ద పింఛను ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అయితే రాజీనామా చేసిన వాలంటీర్లను పెన్షన్ పంపిణీలో భాగస్వామ్యం చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులకు పేర్ని నాని వాయిస్ సందేశం పంపారు. ఆటోలు పెట్టి పెన్షనర్లను సచివాలయాలకు తీసుకువెళ్లాలని అందులో పేర్కొన్నారు. దీంతోపాటు పెన్షనర్లను ఇంటి వద్ద దింపే బాధ్యత కూడా వారిదే అన్నారు. వైసీపీ గ్రూపుల్లో లీక్ అయిన ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.