ముస్లింలు, బ్రాహ్మణులపై దాడులు జరుగుతుంటే సీఎం ఎందుకు స్పందించడం లేదు : పెమ్మసాని - Pemmasani Election campaign - PEMMASANI ELECTION CAMPAIGN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 27, 2024, 4:43 PM IST
Pemmasani Chandrasekhar Election Campaign : రాష్ట్రంలో ఎన్నికలు సమిపిస్తున్నా కొద్ది టీడీపీ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. నేతల ప్రచారానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తుంది. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని బంగార కొట్ల వీధిలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణకారుల షాపుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వర్ణకారులకు నారా లోకేశ్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని తెలిపారు. ఎప్పుడూ నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని చెప్పుకునే ముఖ్యమంత్రి వాళ్లపైన దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు, ఆలయంలో బ్రాహ్మణులపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే అలాంటివారిని చీల్చి చెండాడే వారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి నారా లోకేశ్‌ను, గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని పెమ్మసాని ఓటర్లను అభ్యర్థించారు.