విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగన్‌దే: మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 5:51 PM IST
Palle Raghunatha Reddy Demand Continues Electricity Supply: అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు (Electricity Charges) పెంచమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల్లో తొమ్మిది సార్లు పెంచి ప్రజలను మోసం చేశారని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. నిరంతరాయంగా పగటి పూట రైతులకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డి అధ్వర్యంలో తెలుగదేశం పార్టీ శ్రేణులు, పలువురు రైతులు ఓబులదేవరచెరువు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను (electricity substation) ముట్టడించారు. తొమ్మిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగన్‌కే దక్కుతుందని పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు. 9 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ సరఫరా, రైతుల సమస్యల గురించి పట్టించుకోకుండా ముఖ్యమంత్రి తాడపల్లి క్యాంప్ కార్యాలయంలో కూర్చుంటున్నారని రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు.