Vizianagaram MLC By-Election Cancelled : విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేసింది. మండలి చైర్మన్ నిర్ణయంపై ఇందుకూరి రఘురాజు హైకోర్టులో సవాలు చేశారు.
మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు తప్పు పట్టింది. ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని పేర్కొంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అనర్హత వేటు నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఆయన ఎమ్మెల్సీగా కొనసాగొచ్చని ఇటీవల హైకోర్టు పేర్కొంది. హైకోర్టు నిర్ణయం మేరకు విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఈసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28న జరగాల్సిన ఉపఎన్నిక ప్రక్రియను పూర్తి స్థాయిలో ఈసీఐ రద్దు చేసింది.
రఘురాజుపై అనర్హత వేటు ఎందుకంటే: ఉమ్మడి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ఇప్పటి వరకూ సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. గత ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు అనర్హత వేటుపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో నెలకొన్న ట్వీస్ట్కి తాజాగా ఈసీఐ పుల్‌స్టాప్ పెట్టింది. వైఎస్సార్సీపీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇందుకూరి రఘురాజు 2021లో ఎన్నికయ్యారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన పార్టీ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడ్డారని ఆయన్ని అనర్హుడిగా ప్రకటిస్తూ చర్యలు తీసుకోవాలని మండలిలో ఆ పార్టీ విప్ పాలవలస విక్రాంత్, మండలి ఛైర్మన్‌కు గతంలో ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన మండలి ఛైర్మన్ రఘురాజుపై అనర్హత వేటు వేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 3 నుంచి ఈ స్థానం ఖాళీ అయింది. ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయి ఆరు నెలలు కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 4వ తేదీన ఈ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 28న ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ సైతం విడుదల చేసింది.
అయితే 2027 డిసెంబరు ఒకటి వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ తనను అనర్హుడిగా ప్రకటించడంతో రఘురాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 6న ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. గత ఎమ్మెల్సీ రఘురాజు వాదనలను మండలి ఛైర్మన్ మరోసారి వినాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది.
ఈ ఉపఎన్నికకు నెల 4న నోటిఫికేషన్ విడుదల చేయగా, ఆ రోజు నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. 12వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగగా, 14 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. నామినేషన్లు సైతం పలువురు దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శంబంగి వెంకట చినప్పలనాయుడు నామినేషన్ దాఖలు చేయగా, కూటమి తరఫున పరోక్షంగా శృంగవరపుకోట మండలానికి చెందిన ఇందుకూరి సుబ్బలక్ష్మి, కారుకొండ వెంకటరావు స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్ రద్దు చేస్తూ తాజాగా ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది.
"ఎన్నికల్లో పోటీకే భయపడే పరిస్థితి" - ఘోర పరాభవాన్ని మర్చిపోలేకపోతున్న వైఎస్సార్సీపీ