వైఎస్సార్సీపీ అభ్యర్థి కళావతికి చేదు అనుభవం - పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న స్థానికులు - People Fire on YSRCP Leader - PEOPLE FIRE ON YSRCP LEADER
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 13, 2024, 4:52 PM IST
Palakonda People Fire on YSRCP Leader Vishwarai Kalavathi in Manyam Distirct : ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుంటే, మరో వైపు ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటర్లను నయానో, భయానో మభ్యపెట్టడానికి యత్నించగా వారిని స్థానికులు అడ్డుకుంటున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైఎస్సార్సీపీ నాయకులు వ్యవహరిస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి సంఘటనే పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. పాలకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతికి చేదు అనుభవం ఎదురైంది. పాలకొండ మండలం భాసూరు పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లేందుకు యత్నించిన కళావతిని గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్న వేళ ఎమ్మెల్యే అభ్యర్థి పోలింగ్ కేంద్రంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ఆమెను గ్రామస్థులు నిలువరించారు. దీంతో చేసేదేమీ లేక ఆమె వెనుదిరిగారు.