జగన్ దళిత ద్రోహి- దళితులందరూ గట్టిగా బుద్ధి చెప్పాలి : మందకృష్ణ మాదిగ - ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 12:31 PM IST
MRPS Founder President Mandakrishna on Jagan: దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి నిజమైన రాజకీయ వారసుడు కాదని ఎమ్మార్పీఎస్ (MRPS Founder President Mandakrishna) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల వైఎస్సార్సీపీ పాలనలో దళితులకు చేసిందేమి లేదని మందకృష్ణ ఆరోపించారు. అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేసిన దళిత ద్రోహి సీఎం జగన్ అని పేర్కొన్నారు. కర్నూల్లో ఉమ్మడి జిల్లా దళిత సంఘాల నేతలతో మందకృష్ణ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే ఎస్సీ వర్గీకరణ అమలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తరపున న్యాయవాదిని ఏర్పాటు చేయలేదని ఎస్సీ వర్గీకరణకు ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోలేదని మందకృష్ణ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు (SC Categorisation) అనుకూలంగా ఉన్న బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు ఎస్సీలు మద్దతుగా నిలవాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే ఎస్సీ వర్గీకరణ అమలవుతుంది మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి దళితులందరూ గట్టిగా బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.