రామోజీరావు పేరు మీద జర్నలిస్టులకు విశిష్ట అవార్డులు - ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు - MP ON RAMOJI AWARDS TO JOURNALISTS - MP ON RAMOJI AWARDS TO JOURNALISTS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 22, 2024, 4:00 PM IST
MP Appalanaidu Said Awards Given to Journalists: ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన ఈనాడు సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావు స్మారకార్థానికి గుర్తుగా దేశవ్యాప్తంగా తెలుగు పాత్రికేయులకు ప్రత్యేక పురస్కారాలు ఇవ్వనున్నట్లు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఈనాడు, ఈటీవీతోపాటు రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా ఆయన ఎంతో మందిని తీర్చిదిద్దారని కలిశెట్టి పేర్కొన్నారు. తన కుమార్తె పేరిట ఏర్పాటు చేసిన నిఖిల కలిశెట్టి వైద్య, విద్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పాత్రికేయులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు ఆయన వివరించారు.
ఈ మేరకు సీనియర్ పాత్రికేయులతో మూడు రోజుల్లో కమిటీ వేసి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అప్పలనాయుడు తెలిపారు. 20 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేసి రామోజీరావు స్మారక పురస్కారాలను ప్రదానం చేస్తామని ఆయన పేర్కొన్నారు. బహుమతిగా 20వేల రూపాయలతోపాటు ఒక పుస్తకం ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే విశాఖలోని బీచ్ రోడ్డుతోపాటు దేశవ్యాప్తంగా తెలుగు వారు నివసిస్తున్న ప్రతీ ప్రాంతంలో రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఎంపీ అప్పలనాయుడు వెల్లడించారు.