ఎన్నికల విధులకు వెళ్తూ- రైలు ఢీ కొని తల్లి, కుమారుడు మృతి - Mother Son Dead in Train Accident - MOTHER SON DEAD IN TRAIN ACCIDENT
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 12, 2024, 6:16 PM IST
Mother and Son Dead Was Train Collision in Kavali: నెల్లూరు జిల్లా కావలిలో ఎన్నికల విధులకు వెళ్తూ స్టేషన్లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని తల్లి, కుమారుడు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే సైదాపురం మండలం చాగనం గ్రామానికి చెందిన బి. సుభాషిణి అంగన్వాడీ ఆయాగా పని చేస్తున్నారు. అధికారులు ఆమెకు కావలిలో ఎన్నికల విధులు కేటాయించారు. దీంతో తన కుమారుడు విజయ్‌తో కలిసి సుభాషిణి బయల్దేరారు. కావలి పట్టణంలోని రైల్వే ట్రాక్ దాటే క్రమంలో ఆమె రైలు వస్తున్న విషయాన్ని గుర్తించలేదు.
వెంటనే రైలు రావటాన్ని చూసిన కుమారుడు తల్లిని పిలిచినా పలకపోవడంతో ట్రాక్ పైకి వెళ్లి తల్లిని రక్షించే క్రమంలో కుమారుడు పట్టాలపైకి వెళ్లగా ఇంతలో వేగంగా వచ్చిన రైలు ఇద్దరిని ఢీకొట్టింది. దీంతో తల్లి, కుమారుడు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటనను చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైయ్యారు. అనంతరం రైల్వే పోలీసులు మృతదేహలను పోస్టుమార్టంకు తరలించారు. రైలు పట్టాలు దాటే క్రమంలో పట్టాలపై అటు ఇటు చూసి వెళ్లమని ప్రయాణికులకు అధికారులు సూచిస్తున్నారు.