గోదావరి వరద తగ్గుముఖం- లంక గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరం - Godavari flood - GODAVARI FLOOD
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 31, 2024, 12:38 PM IST
MLA Datla Buchi Babu Visited Lanka Villages In Konaseema District : గోదావరి వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలు ఠానేలంక, కూనాలంక, గురజాపులంకల్లో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి, నిత్యావసర సరుకులు అందించారు. ఇళ్లు ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు 3వేల రూపాయల చొప్పున తక్షణ సాయం అందించారు. వర్షాలకు పొలాలు మునిగిపోయాయని, పంట నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. నదీ కోత నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఏడాది వరదల నియంత్రణకు 200 కోట్లు మంజూరు చేస్తా.. పనులన్నీ సక్రమంగా జరగాలని చెప్పిన జగన్ మాటలు గోదారిలో కొట్టుకుపోయాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వరద నివారణకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేది ఉన్నతాధికారులతో సమీక్షించారని తెలిపారు.