గణపయ్యకు వీడ్కోలు పలికేందుకు సిద్ధమైన కర్నూలు - ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి భరత్ - GANESH IMMERSION IN KURNOOL - GANESH IMMERSION IN KURNOOL
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2024, 10:28 PM IST
Vinayaka Immersion Arrangements in Kurnool : తొమ్మిది రోజుల పాటు కర్నూలు పట్టణంలోని వాడవాడల్లో పూజలందుకున్న గణపయ్యలను నిమజ్జనం చేసే వేళయింది. రేపు (ఆదివారం) గణనాథులకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు నగరంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వినాయక ఘాట్‌లో కొనసాగుతున్న ఏర్పాట్లను మంత్రి టీ.జీ భరత్ అధికారులతో కలిసి పరిశీలించారు. దాదాపుగా 2 వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నందున అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో కర్నూలులో మట్టి విగ్రహాలనే పూజించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి కమిటీ సభ్యులను కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్‌పై ఆంక్షలను విధించారు.
పట్టణంలో వినాయక నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కర్నూలు సహా నంద్యాల, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలకు చెందిన వెయ్యి మందికి పైగా పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. సీసీ కెమెరాలు, బాడీ ఓన్ కెమెరాలు సహా డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించనున్నట్లు వివరించారు. అసాంఘిక శక్తులు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్నూలులోకి వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నామని ఎస్పీ తెలిపారు.