ప్రకృతి విపత్తును రాజకీయం చేయాలని చూస్తే గుణపాఠం తప్పదు : మంత్రి పొన్నం - Minister ponnam comments
Published : Sep 3, 2024, 2:07 PM IST
Minister Ponnam On Floods In Telangana : వరదలు రావడానికి, ప్రాణాలు పోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమీ లేదని, ప్రకృతి విపత్తును రాజకీయం చేయాలని చూస్తే తగిన గుణపాఠం తప్పదని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. బీఆర్ఎస్, బీజేపీలు విపత్కర పరిస్థితుల్లో కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లలేదని మండిపడ్డారు. ఎక్స్ వేదికగా ఒకరు, ఫామ్ హౌస్‌లో కూర్చుని మరొకరు విమర్శలు చేస్తున్నారని కేటీఆర్, కేసీఆర్‌లను ఉద్దేశిస్తూ విమర్శించారు.
వర్షాలు కాస్త ఎడతెరిపినిచ్చినా ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ అయిందని అక్కడ సంబంధిత చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ప్రమాదవశాత్తు మృతి చెందిన వారికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు వెల్లడించారు. హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. ప్రభుత్వం ప్రజల పక్షాన ఉందని స్పష్టం చేశారు. వరద ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.