పోలవరం డయాఫ్రమ్ వాల్, పెండింగ్ పనులకు కేంద్రాన్ని నిధులు కోరాం: నిమ్మల - Minister Nimmala met Union Minister
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 22, 2024, 10:19 PM IST
Minister Nimmala Ramanaidu met Union Minister CR Patil: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్, పెండింగ్ పనులకు కేంద్రాన్ని నిధులు కోరినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కూటమి ఎంపీలు, కేంద్రమంత్రులతో కలసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను మంత్రి నిమ్మల దిల్లీలో కలిశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కోసం కేంద్రమంత్రిని నిధులు కోరినట్లు నిమ్మల చెప్పారు. ప్రాజెక్టు పూర్తికి అవసరమైన సహాయం అందిస్తామని కేంద్రమంత్రి చెప్పినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటామని తెలిపారు. పోలవరం పూర్తికి సహకరిస్తామని ప్రాజెక్టు పనులు ఆలస్యం కాకుండా చూస్తామని కేంద్రమంత్రి చెప్పినట్లు తెలిపారు. డయాఫ్రం వాల్, కాఫర్ డ్యామ్‌లు తిరిగి నిర్మించాల్సి వస్తోందని అన్ని విధాలా పరిశీలించి ప్రాజెక్టు పూర్తికి సమన్వయంతో వెళ్లాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాల నుంచి దూరంగా ఉండటానికే జగన్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడానికే జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలని రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోవట్లేదని అందుకే దిల్లీకి వస్తున్నారని అన్నారు.