ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది: మంత్రి కొండపల్లి - Minister Kondapalli Comments - MINISTER KONDAPALLI COMMENTS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 12, 2024, 4:44 PM IST
Minister Kondapalli Srinivas Attended Public Grievance: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్లో అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు. ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించారు. వచ్చిన వినతుల్లో భూ సమస్యలే ఎక్కువగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. వాటిలో చాలావరకు వెంటనే పరిష్కారం చూపినట్లు వివరించారు. గత ఐదేళ్లుగా జరిగిన సమస్యలను చూస్తే ఆశ్చర్యమనిపించిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిస్కార వేదికలో పాల్గొనడం జరిగిందన్నారు.
క్షేత్ర స్థాయిలో సమస్యను పరిష్కరించి, వచ్చిన ఫిర్యాదుదారునికి పరిష్కార మార్గం చూపించామన్నారు. సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలనే ఆలోచనతో ప్రజా ప్రతినిధులు, అధికారులతో గ్రీవెన్స్ నిర్వహించడం వల్ల మంచి ఫలితం వచ్చిందన్నారు. రెవెన్యూలో ఎక్కువ వినతులు వచ్చాయని, ఏకంగా 1బీ మార్చేశారని చాలా మంది ఫిర్యాదు చేశారనీ తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో, అదే విధంగా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఎలా కల్పించాలి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ అన్నారు.