అధికార పార్టీ అండదండలతో మైలేరు పండగ- కట్టడి చేయడంలో పోలీసులు విఫలం - అగ్రహారంలో మైలేరు పండగ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 1:52 PM IST
Mileru Festival Was Organized With YCP Flags: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం జంగాల అగ్రహారంలో వైసీపీ జెండాలతో మైలేరు పండగను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మూడు రాష్ట్రాల నుంచి పోటీదారులు పశువులను తీసుకువచ్చారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి భారీ బహుమతులను ప్రకటించారు. రాష్ట్రంలో నిషేధించిన ఈ పండగను అధికార పార్టీ అండదండలతో వైసీపీ జెండాలు పెట్టి మైలేరు పండగను నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు జరగనివ్వకుండా పోలీసులు కట్టడి చేయాల్సిందిపోయి తమ ఆంక్షలు కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతున్నాయని చెబుతున్నారు. మూగజీవులను హింసించడం అనేది నేరమని తెలిసినప్పటికీ కట్టడి చేయాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.
గతంలో మైలేరు పండగ నిర్వహించడం వల్ల చాలా మంది గాయపడ్డారు. కొంత మంది అయితే ప్రాణాలను సైతం కోల్పోయారు. మరికొందరు మంచానికే పరిమితమై నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ పండగ కారణంగా ఎంత మంది నష్టపోయినా మళ్లీ నిర్వహిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎన్ని జరుగుతున్నా ఇలాంటి పశువుల పండగను కట్టడి చేయడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. దీనికి కారణం అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలే అని స్పష్టంగా తెలుస్తోంది.