పండగ అయిపోయింది - పల్లెలు ఖాళీ అయ్యాయి - తిరిగి ప్రారంభమైన వలసలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 23, 2024, 7:55 PM IST
Migrations Restart in AP: సంక్రాంతి అయిపోవడంతో వలసలు తిరిగి ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో దూర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు గతవారం తిరిగి తమ గ్రామాలకు చేరుకున్నారు. అయితే పండగ పూర్తి కావడంతో వలస కూలీలు వారం రోజుల అనంతరం తిరిగి పయనమయ్యారు. కర్నూలు జిల్లాలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్, రబీ రెండు పంటలు వేసినా కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలోని కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల నుంచి వేలమంది వలస వెళ్లిపోయారు. గుంటూరు, కర్ణాటక, తెలంగాణ తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. కౌతాళం మండలం గోతులదొడ్డి గ్రామం నుంచి సుమారు 700 మంది, పొదలకుంట, మదిరె, కాత్రికి, నడిచాగి, తిప్పలదొడ్డి, కరణి వల్లూరు తదితర గ్రామాల నుంచి 3 వేల మంది వలస బాట పట్టారు. ఆస్పరి మండలం శంకరబండ గ్రామం నుంచి సమారు వంద కుటుంబాలు వలస వెళ్లాయి. తమకు గ్రామాల్లో ఉపాధి కల్పిస్తే వలసలు వెళ్లాల్సిన పరిస్థితి లేదని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని వలస కూలీలు కోరుతున్నారు.