వలసలు ఎంత నిజమో, వలసల్లో ఉండే శ్రమ దోపిడీ కూడా అంతే నిజం : కేటీఆర్ - KTR relased Meka bathuku Book - KTR RELASED MEKA BATHUKU BOOK
Published : Jul 14, 2024, 5:36 PM IST
Meka Bathuku Book Released by KTR in Hyderabad : మెరుగైన జీవనోపాధి కోసం మనిషి ఎప్పటికప్పుడు వలసల రూపంలో ప్రయాణిస్తూనే ఉంటాడని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు దినదినాభివృద్ధి చెందేందుకు వెళ్లేవారికి వలసలు ఆశలతోరణం అన్నారు. అదే దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి వలసలు ఆశలతో రణం అని ఆలోచింపజేసేలా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో "మేక బతుకు" అనే పుస్తకాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు.
మలయాళంలోని ఆడు జీవితం అనే ఈ పుస్తకం తొలుత ఆంగ్లంలోకి అనువాదం అయ్యింది. స్వర్ణ కిలారి అనే రచయిత్రి తాజాగా ఆంగ్లం నుంచి తెలుగులోకి ఈ మేక బతుకు పుస్తకాన్ని అనువదించారు. నిన్నటి కంటే రేపు బాగుంటుందనే ఆశను నిలబెట్టుకునేందుకు ఈ పుస్తకాన్ని చదవాలని స్వర్ణ కిలారి సూచించారు. వలసల్లో ఉండే చీకటి కోణాన్ని, వ్యథను స్వర్ణ తెలుగులోకి చక్కగా అనువదించారని అతిథులు అభినందించారు. అలాగే వలసలు ఎంత నిజమో వలసల్లో ఉండే శ్రమ దోపిడీ కూడా అంతే నిజమని కేటీఆర్ వివరించారు. వలసల పట్ల సాహిత్యం, చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.