పద్మశ్రీకి ఎంపికైన గడ్డం సమ్మయ్య, డా.ఆనందచారిని సన్మానించిన మెగాస్టార్ - మెగాస్టార్ చిరంజీవి వార్తలు
Published : Jan 30, 2024, 8:18 PM IST
Megastar Chiranjeevi Felicitated Padma Shri Awardees : ఇటీవల పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, డాక్టర్ ఆనందచారి వేలును మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా సన్మానించారు. వారిద్దరిని జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి ఆహ్వానించిన చిరంజీవి, శాలువాతో వారివురినీ సత్కరించారు. యక్షగాన కళలో సమ్మయ్య కృషిని, శిల్పకళలో ఆనందచారి వేలు ప్రతిభను ప్రశంసిస్తూ వారితో కాసేపు ముచ్చటించారు. కళారూపాలను, కళాకారులను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళలతోపాటు కళాకారులను కాపాడుకోవాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తన నివాసానికి ఆహ్వానించి చిరంజీవి సత్కరించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని కలిగించిందని సమ్మయ్య, ఆనందచారి సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు చిరంజీవి నివాసానికి ఇంకా సినీ, రాజకీయ ప్రముఖుల తాకిడి కొనసాగుతూనే ఉంది. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీనుంచి చిరును ఘనంగా సన్మానించేందుకు ఓ ప్రత్యేకమైన ఈవెంట్ సైతం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.