భక్తి శ్రద్ధలతో తీజ్ వేడుకలు - ఆకట్టుకుంటున్న సంప్రదాయ నృత్యాలు - Teej festival celebrations
Published : Aug 21, 2024, 1:59 PM IST
Teej Festival Celebrations In Kamareddy : కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామంలో మధుర లంబాడీల ముఖ్య పండుగైన తీజ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ వేడుకలు లంబాడీల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. తీజ్ పండుగ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున లేదా రక్షాబంధన్ పర్వదినం రోజున ప్రారంభమవుతుంది. ఈ పండుగ సందర్భంగా బుట్టలలో విత్తనాలను నాటుతారు. చివరిరోజు మొలకెత్తిన గిన్నెలను మహిళలు చెరువులో ముంచుతారు.
తీజ్ వేడుకల సందర్భంలో స్త్రీలు జగదాంబను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పెళ్లికాని యువతులు మంచి భర్తను పొందడానికి దేవత ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. వివాహిత మహిళలు తమ భర్తల క్షేమం కోసం ప్రార్థిస్తారు. మట్టితో అలంకరించిన దేవాలయం లాంటి కట్టడం చుట్టూ చేరి ప్రదక్షిణలు చేస్తూ సంప్రదాయ నృత్యాలు చేస్తారు. ఈ దేవాలయాన్ని వ్యవసాయ క్షేత్రాల నుండి సేకరించిన మట్టి (నల్ల నేల), 21 కర్రలను ఉపయోగించి తయారుచేస్తారు. ఆ తర్వాత ఆ నిర్మాణాన్ని ఆభరణాలతో అలంకరిస్తారు.