కిడ్నాప్ కేసు రిమాండును తిరస్కరించిన మెజిస్ట్రేట్ - నోటీసు ఇచ్చి పంపాలని ఆదేశం - కిడ్నాప్ కేసు రిమాండును తిరస్కరణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 23, 2024, 5:58 PM IST
Magistrate Rejects Remand in Kidnapping Case: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి దస్తగిరి, ఆయన కుమారుడు అరుణ్ తేజతో పాటు మరో ముగ్గురిపై నమోదైన కిడ్నాప్ కేసు రిమాండును మెజిస్ట్రేట్ తిరస్కరించారు. నోటీసు ఇచ్చి పంపాలని పోలీసులను ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే: పట్టణంలోని కొంపలపుల్లన్న వీధికి చెందిన మహబూబ్ బాషా డబ్బులు బాకీ ఉండటంతో ఆ మొత్తాన్ని చెల్లించాలని దస్తగిరి అడగ్గా వారి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మహబూబ్ బాషాను ద్విచక్రవాహనంపై మూడో పట్టణ ఠాణాకు తీసుకెళ్లారు. అంతలోనే తన సోదరుడిని దస్తగిరి, ఆయన కుమారుడు, మరికొందరు కిడ్నాప్ చేశారంటూ మహబూబ్ బాషా అన్న జమాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో దస్తగిరి సహా మొత్తం ఐదుగురిపై ఆదివారం రాత్రి పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్రెడ్డి పట్టణ అధ్యక్షుడు జబివుల్లాతో కలిసి పోలీసులు తీరును నిరసిస్తూ సోమవారం ఠాణా వద్ద ఆందోళన చేశారు. దస్తగిరి, ఆయన కుమారుడు అరుణ్ తేజతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండు నిమిత్తం సోమవారం రాత్రి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కేసు వివరాలు పరిశీలించిన మేజిస్ట్రేట్ కిడ్నాప్ కేసు వారికి వర్తించదని రిమాండును తిరస్కరించారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున నోటీసు ఇచ్చి వారిని స్టేషన్ నుంచి పంపించేశారు.