ఆసుపత్రి భవనంలో సచివాలయం - స్థానికుల ఆగ్రహం - government hospital - GOVERNMENT HOSPITAL
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 3, 2024, 3:23 PM IST
Government hospital: పేద, మధ్య తరగతి మహిళలకు ప్రసూతి సేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో రూ. 20లక్షలకు పైగా ఖర్చు చేసి నిర్మించిన భవనాన్ని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఈ భవనంలోని ఓ ఫ్లోర్‌ని వీఎంసీ శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్లు వినియోగిస్తుండగా మరో ఫ్లోర్లో 40 నెంబర్ వార్డు సచివాలయన్ని నిర్వహిస్తున్నారు. విజయవాడ మొగల్రాజపురంలోని బందుల దొడ్డి ప్రాంతంలో ఉన్న ఆసుపత్రి ఈ చుట్టుపక్కల నివసిస్తున్న సుమారు 20వేల మందికి ఉపయోగ పడుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం ఇతర అవసరాలకు ఉపయోగించడంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది.
ఇదే భవనానికి ఎదురుగా ఉన్న మరో చిన్నపాటి భవనంలోనూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గతంలో నిర్వహించారు. ప్రస్తుతం ఆ భవనాన్నీ ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. చిన్నపాటి రోగానికి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల కొండ ప్రాంతం ఉండడంతో వారికి వైద్య సౌకర్యాలు సకాలంలో అందక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నిర్వహించిన ఆసుపత్రులు మూత పడడంతో ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు వైద్య సౌకర్యాలు అందకుండా పోయాయి. ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతంలో డయేరియా వ్యాపించి సందర్భంలో ప్రభుత్వ ఆసుపత్రి లేక స్థానికంగా ఉన్న సీపీఎం కార్యాలయాన్ని తాత్కాలిక ఉచిత వైద్య శిబిరంగా వినియోగిస్తున్నారు. దీంతో ఈ రెండు భవనాలను నిర్మించిన లక్ష్యాలు నెరవేరడం లేదని స్థానికులు పేర్కొన్నారు.