సహాయక చర్యలు ముమ్మరం- వరద బాధితులకు ఆహార ప్యాకెట్ల పంపిణీ - Flood relief operations in ap
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 2, 2024, 4:02 PM IST
|Updated : Sep 2, 2024, 4:18 PM IST
Locals are Volunteering to Help Flood Victims in Vijayawada : భారీ వర్షాలతో విజయవాడలోని చిట్టినగర్ జంక్షన్ నుంచి పాల ఫ్యాక్టరీ వరకు రోడ్లు, ఇళ్లన్నీ జలమయమయ్యాయి. వరద బాధితులకు ఆహారం అందించేందుకు కల్యాణమండపంలో వంటలు చేస్తున్నారు. NDRF సిబ్బంది బోట్ల ద్వారా వెళ్లి బాధితులకు ఆహారం అందిస్తున్నారు. వరదలో చిక్కుకుపోయిన వారికి ఆహారం అందించేందుకు స్థానికులు స్వచ్ఛందంగా ప్రత్యేక వాహనాల ద్వారా ఇంటింటికి వెళ్లి తాగునీరు, పాలప్యాకెట్లు పంచుతున్నారు. "సుమారు 15 వేల మందికి పైగా సరిపడా ఆహారాన్ని తయారు చేసి అందిస్తున్నాం. చాలా చోట్ల నడుములోతు వరకు నీరు ప్రవహిస్తుంది. అయినా ప్రతి ఇంటికి వెళ్లి ఆహారం, తాగునీరు, పాలప్యాకెట్లు అందిస్తున్నాం. బాధితులకు సేవచేయటం గర్వంగా ఉంది. వరద ప్రభావం తగ్గే వరకు బాధితులకు అండగా ఉంటాం" అని స్వచ్ఛంద సేవకులు తెలిపారు.
వరద ప్రభావంతో విజయవాడ నగరం, శివారు ప్రాంతాలు, పలు కాలనీలు నీటమునిగాయి. నగరానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బుడమేరు వాగు ప్రభావిత ప్రాంతాలు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. శివారు ప్రాంతాలవారు పడవల్లో ప్రయాణిస్తున్నారు. పల్లపు ప్రాంతాల్లో దాదాపు 5-7 అడుగుల మేర వరద చేరగా, ప్రధాన, అంతర్గత రహదారులపై 4 అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తోంది.
వరదల సహాయం కోసం ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సాయం కావాల్సిన వారు ఫోన్ చేయొచ్చని అధికారులు తెలిపారు. వీఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ - +91 81819 60909, వీఎంసీ ల్యాండ్‌లైన్ నెంబర్ - 0866-2424172, 0866-2427485, కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెం. - 0866-2575833, కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెం. 18004256029, 112 , 1070