శంషాబాద్‌లో చిరుత కలకలం! - రంగంలోకి అటవీ శాఖ సిబ్బంది - Leopard AT SHAMSHABAD - LEOPARD AT SHAMSHABAD
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 25, 2024, 12:43 PM IST
Leopard At Shamshabad : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఘాన్సిమియగూడలో చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టిస్తోంది. ఇటీవల అదే జంతువు కుక్కపై దాడి చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. కాగా సోమవారం అర్ధరాత్రి సమయంలో సీసీ టీవీ విజువల్స్‌లో కనిపించిన దానిని చిరుతగా అటవీ అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆ జంతువు ఏంటనేది ఇంకా స్పష్టంగా నిర్ధారించాల్సి ఉంది. అయితే చిరుతే అని భావిస్తున్న అధికారులు దాన్ని బంధించేందుకు మూడు బోన్లతో పాటు 10 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈరోజు మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
కొన్నాళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. శంషాబాద్ విమానశ్రయంలో చిరుత పులి సంచరిస్తూ కలకలం సృష్టించింది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఎయిర్‌పోర్టు ప్రహరీ నుంచి చిరుత దూకినట్లు అధికారులు గుర్తించారు. దాంతో పాటు మరో రెండు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు. చిరుత విమానాశ్రయం ప్రహరీ దూకుతుండగా విమానాశ్రయ పెన్సింగ్ వైర్లకు తగలింది. దీంతో ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూంలో అలారం మోగింది. ఆ తర్వాత రెండ్రోజులు శ్రమించి చిరుతను పట్టుకున్నారు.