ఇంటినే పేకాట క్లబ్‌గా మార్చిన న్యాయవాది ముష్టి శ్రీనివాసరావు - గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ - Lawyer Musti Srinivasa Rao Arrest - LAWYER MUSTI SRINIVASA RAO ARREST
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 14, 2024, 10:29 AM IST
|Updated : Aug 14, 2024, 11:02 AM IST
Lawyer Musti Srinivasa Rao Arrest : వైఎస్సార్సీపీ హయాంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై నిరాధార ఆరోపణలు చేసిన న్యాయవాది ముష్టి శ్రీనివాసరావు జూదం క్లబ్ నిర్వహిస్తూ పోలీసులకు చిక్కడం చర్చనీయాంశమైంది. విజయవాడ గవర్నర్‌పేట పాలపర్తివారివీధిలోని తన ఇంట్లో క్లబ్బు నిర్వహిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. పోలీసుల్ని చూసి పారిపోయిన ముష్టి శ్రీనివాసరావు ఆ తర్వాత లొంగిపోయారు. అలాంటి వ్యక్తిని అప్పటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా కుర్చీలో కూర్చోపెట్టుకుని మార్గదర్శిపై బురద చల్లించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
చిట్టీ వాయిదాలు సక్రమంగా చెల్లించని ముష్టి శ్రీనివాసరావు రివర్స్‌లో మార్గదర్శిపై నిరాధార ఆరోపణలు చేశారు. అతను ఇచ్చిన ఫిర్యాదుతో గతేడాది జులై 20న మార్గదర్శిపై పోలీసులు గుడ్డిగా కేసు నమోదు చేశారు. ముష్టి శ్రీనివాసరావుకు వత్తాసు పలికిన నాటి పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఆయనేదో అంతర్జాతీయ స్థాయి ప్రముఖుడన్నట్లుగా రాచమర్యాదలు ప్రదర్శించారు. పక్కనే కూర్చోబెట్టుకుని మార్గదర్శిపై అసత్య ఆరోపణలు చేయించారు. శ్రీనివాసరావు తప్పులపై విలేకరులు ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పకుండా ఎదురు దాడి చేశారు. అలాంటి ముష్టి శ్రీనివాసరావు ఇప్పుడు జూదం నిర్వహిస్తూ పట్టుబడటంతో ఆ నాటి ఉదంతాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు.