లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మిస్టరీగా మారిన విద్యార్థిని మృతి- ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు - మైలవరంలో విద్యార్థిని మృతి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 3:01 PM IST
Lakkireddy Balireddy Engineering College Student Died : ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిని మృతి మిస్టరీగా మారింది. హాస్టల్లో గదిలో రాత్రి విద్యార్థిని మృతదేహాన్ని కనుగొన్నారు. విషయం తెలుసుకున్న యాజమాన్యం కళాశాలకు సెలవును ప్రకటించింది. సెక్యూరిటీ మీడియాను లోపలికి అనుమతించలేదు. పోలీసులు హాస్టల్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు కళాశాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థిని మృతదేహాన్ని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలిస్తుండగా విద్యార్థిని బంధువులు అడ్డుకున్నారు. ఏం జరిగిందో చెప్పాలంటూ కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులతో కాలేజీ యాజమాన్యం, పోలీసులు చర్చలు జరుపుతున్నారు.
తమకు ఉదయం సమాచారం తెలియడంతో హాస్టల్‌కి వచ్చి దర్యాప్తు చేపట్టామని స్థానిక సీఐ కిషోర్ తెలిపారు. ప్రాథమికంగా వచ్చిన సమాచారం ప్రకారం శుక్రవారం విద్యార్థిని డిస్ట్రబ్‌గా ఉన్నట్లు తెలిసిందని అన్నారు. సెమిస్టర్లో రెండు సబ్జెక్టులు మిగిలి ఉన్నాయని తెలిపారు. డబ్బులు వృధా చేస్తున్నట్లు రాత్రి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిందని, విద్యార్థిని తల్లిదండ్రులకు మధ్య కోపంతో మాట్లాడుకున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఫ్యాన్‌కు చున్నితో ఉరి వేసుకున్నట్లుగా ఉందని, అలాగే చేతికి కర్చీఫ్ కట్టి ఉందని, చేతి మీద గాయం కూడా ఉందని పోలీసులు తెలిపారు. విద్యార్థిని మృతి గల కారణాలు, ఆత్మహత్యా లేక మరేదైనా అనేది దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. పోస్ట్ మార్టం అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని సీఐ పేర్కొన్నారు.