రెండో టెస్టుకు ప్రాక్టీస్ షురూ - ఈనెల 2 నుంచి విశాఖలో ఇండియా, ఇంగ్లాండ్ మ్యాచ్ - india england second test
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 10:17 AM IST
India vs England Test Series 2024: విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న రెండో టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌కు ఇప్పటికే ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రెండు జట్ల టీం సభ్యులు విశాఖ చేరుకున్నారు. బుధవారం ఇరుజట్ల ఆటగాళ్లు స్టేడియం బయట ఉన్న బి గ్రౌండ్లో ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేశారు.
ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు, రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్‌ను ఓడించేందుకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. మొదటి మ్యాచ్ ఓటమిలో ఉన్న భారత్ ఆటగాళ్లు మిగిలిన అన్ని టెస్ట్ మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో నెట్లో తీవ్రంగా శ్రమించారు. విశాఖలోని వైయస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఇప్పటివరకు భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో, రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా భారత్ విజయం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.