అట్టహాసంగా ఇండో అమెరికన్ సంయుక్త సైనిక విన్యాసాలు- సత్తాచాటిన త్రివిధ దళాలు - india us tiger triumph 2024
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 29, 2024, 7:44 PM IST
India US Tiger Triumph 2024: భారత్ -అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలు కాకినాడలో ఆకట్టుకున్నాయి. సూర్యారావు పేటలో సాగరతీరంలో టైగర్ ట్రైమ్ 2024 పేరిట ఈ విన్యాసాలు నిర్వహించారు. ప్రకృతి విపత్తులు, సునామీలు వచ్చే సమయంలో సైనిక స్పందన అందించాల్సిన సాయంపై ప్రదర్శనలు చేపట్టారు. భారత్ నుంచి 700 మంది, అమెరికా నుంచి 400 మంది త్రివిధ దళాల సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు.
ఇరు దేశాలకు ఈ సైనిక విన్యాసాలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు చెప్పారు. ప్రకృతి వైపరిత్యాల సమయంలో ఎలాంటి కార్యకలాపాలను చేయాలి, వాటిని ధీటుగా ఎదుర్కొని నష్టాన్ని తగ్గించుకోవడం వంటి విన్యాసాలు చేసినట్లు వారు తెలిపారు. వీటి ద్వారా రెండు దేశాలకు ఎంతో మేలు చేకూరుస్తోందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశాల సైనిక విన్యాసాలు ఎంతో ఆకట్టుకున్నాయని అమెరికా నేవీ అధికారి మార్టినేజ్ అన్నారు. ఇలాంటి కార్యకలాపాల వలన ఇరు దేశాల సైనిక బంధం బలపడుతుందని ఆయన పేర్కొన్నారు.
భారత్ తరుపున ఐఎన్‌ఎస్ కేశరి, ఐఎన్‌ఎస్ ఐరావతం.. అమెరికా నుంచి జర్మన్ టౌన్ యుద్ధ నౌకలు, యూఎస్ 53 ఎయిర్ క్రాఫ్ట్ , యూఎస్ 3 హెచ్ చేతక్, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులు ప్రదర్శనలో భాగమయ్యాయి. భారత్ కమాండర్ నావీ రాజేష్ ధన్‌కర్, ఆర్మీ మేజర్ జనరల్ అఖిలేష్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.